Thursday, July 3, 2008

కొరియా కబుర్లు - 6

దాదాపు ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. రోజూ మధ్యాహ్నం రూమ్ కి వచ్చి తిని వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందయిపోతోంది.. అయినా అంత కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది.. ఎందుకంటే ప్రొద్దున్న ఆఫీస్ కి వచ్చిన తరువాత ఇప్పుడే బయట ప్రపంచాన్ని చూసేది... సో అలా కాస్త రిలీఫ్ గా ఉంటుంది.... మధ్యాహ్నం దాకా ఎందుకు, ప్రొద్దున్న కూడా ఎండ మండిపోతూ ఉంటుంది.. ఎండ కంటే చెమట ఎక్కువగా ఉంటోంది....

ఇక ప్రదేశాల విషయానికి వస్తే, ఎవర్లాండ్ థీమ్ పార్క్ గురించి చెబుతాను.. నేను ఇక్కడకి వచ్చిన మూడో వారమే వెళ్ళాను కానీ, దీని గురించి ఇప్పటివరకూ వ్రాయడానికి కుదరలేదు!

సువాన్ నుండి ఒక అరగంట ప్రయాణం బస్ లో.. నేను ఇక్కడకి వచ్చిన తరువాత ఇదే మొదటిసారి బస్ ఎక్కడం.. చూడడానికి పరిసర వాహినుల టైప్ లో ఉన్నా, లోపల సీట్లు వోల్వో బస్స్ ల్లోలా ఉన్నాయి...చాలా స్పీడ్ గా తీసుకువచ్చేశాడు.. మేము ఇంకా ఎంత టైమ్ పడుతుందో అనుకున్నాం కానీ, అసలు ఇలా ఎక్కి అలా దిగినట్లనిపించింది...

ఇక్కడ చూడాల్సినవి చాలా ఉంటాయి, కాబట్టి ఎక్కువ చూడాలంటే తొందరగా రావాలి అని వేకువజామునే (అంటే ఎనిమిది!) బయలుదేరి వచ్చేశాము.. మేము అక్కడికి చేరుకునేసరికే పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి.. మేము కూడా టిక్కెట్ తీసుకుని ఒక లైన్ లో నించున్నాము... ఎంట్రీ టిక్కెట్లు రకరకాలు ఉన్నాయి... ఒకటేమో కేవలం ప్రవేశం, ఏ రైడ్ కి వెళ్ళాలనుకుంటే దానికి టిక్కెట్ కొనుక్కోవాలి.. ఇంకోటి ఫ్లాట్ రేట్... ఒకసారి టిక్కెట్ కొనుక్కుంటే ఇక ఏదైనా ఎక్కేయచ్చు...మేము ఇది తీసుకుని వెయిట్ చేస్తూ నించున్నాం...



ఎప్పటిలానే మా లైన్ చాలా పెద్దదిగా, ప్రక్క లైన్లన్నీ చాలా చిన్నవిగా ఉన్నాయి.! గేట్ ఓపెన్ చేసేది తొమ్మిదింటికి.. ఇక మాట్లాడుకుంటూ నించున్నాం.. మా ప్రక్కన లైన్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు.. తెగ గొడవ చేస్తున్నారు.. మేము లైన్ లో నించోవడం ఆలస్యం మా మీద పడింది వాళ్ళ దృష్టి.. కనీసం పెద్ద ముండావాళ్ళమని కొంచెం కూడా గౌరవం లేకుండా, మా మీద జోకులు.. ఇక-ఇకలు పక-పకలు.. ఆ కొరియన్ భాషలో ఎన్ని రకాలుగా కామెంట్లు చేసుకోవాలో అన్ని రకాలుగా చేసేశారు ఆ కాసేపట్లో... బెంగళూరులో ఆటో వాళ్ళు కూడా ఇంత అవమానించలేదు నన్నెప్పుడూ!! చివరికి LKG పిల్లలకి కూడా లోకువయిపోయాము మేము.. ఊరికే హాయి చెబితే చూడండి ఎలా బెదిరిస్తోందో!!!



కాసేపు వాళ్ళ ర్యాగింగ్ కి బలైన తరువాత ఓపెన్ చేశారు గేట్! హమ్మయ్య అనుకుని ఇక లోపలికి పరిగెట్టాం... మొదట్లోనే ఏవేవో ఉన్నాయి... ఎటువైపు వెళ్ళాలో అర్ధం కాలేదు.. ఇంతలో ఆత్మసీత(ఆడ మనస్సాక్షి అన్నమాట!) ఇక్కడెక్కడో మ్యాప్ ఉంటుంది దాన్ని వెతుకు అని పురమాయించింది... సరే అని చూస్తే మ్యాప్ అయితే దొరికింది కానీ అది ఇంగ్లీష్ కాదు.. అయితే ఏం, బొమ్మలున్నాయి కదా అది చాలు అని బయలుదేరాము.. అప్పటికే నేను నా కెమెరాకి ఫుల్ గా పని చెప్పేశాను...

కొంచెం దూరం వెళ్ళగానే రోలర్ కోస్టర్ కనిపించింది... సరే అని ఎక్కేశాం.. పైకి ఎక్కుతున్నప్పుడు ఏంటబ్బా ఇంత చిన్నగా తీసుకెళుతున్నాడు అనుకున్నాం.. అలా ఆలోచన వచ్చిందేలేదో, ఇంకే ఆలోచన రాకుండా తిరగ తిప్పేశాడు.. అమ్మో అనుకునేలోపు ఇంకో రౌండ్.. సరే అని మెల్లగా అడ్జస్ట్ అయ్యేలోపు అయిపోయింది అని దించేశాడు!!! పాపం మా కూడా వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఈ రైడ్లు గట్రా పడవట.. మొదట ఎక్కిందే చుక్కలు చూపించేసరికి వాళ్ళు డీలా పడిపోయారు.. మేము మాత్రం రెట్టించిన ఉత్సాహంతో రెండో దానికి బయలుదేరాం..



అలా ఆ ప్రాంతంలో ఉన్న రైడ్స్ అన్ని విజయవంతంగా ముగించేసి, ఇంకో వైపు కి వెళ్ళాం.. అక్కడ సఫారీ ఉంది... సరే అని దానికి బయలుదేరాం..పులులు, సింహాలు, ఏనుగులు, కోతులు, చింపాజీలు బానే ఉన్నాయి.. కాకపోతే, నాకు ఎంట్రన్స్ లో కనిపించిన ఆర్టిఫిషియల్ వాటికి లోపల ఉన్న నిజం వాటికి పెద్ద తేడా కనిపించలేదు! కావాలంటే మీరూ చూడండి...


సింహాలు మాత్రం ఎందుకో చాలా బధ్ధకంగా ఉన్నాయి.. మేము ఫోటోలు తియ్యబోతుంటే మొహం తిప్పేసుకున్నాయి, కానీ కొరియన్స్ తీస్తుంటే మాత్రం తెగ ఫోజ్ లు ఇచ్చేసాయి!!! ఎంతైనా జాతి వివక్ష.. మనం తిరిగిరాగానే, దీని మీద విస్తృతం గా చర్చించాలని అప్పటికి ప్రక్కన పెట్టేశాం! తరువాత బోటింగ్ కి వెళ్ళాం.. అది కూడా చాలా బావుంది.. నిజానికి అక్కడ జలపాతాలు కానీ సరస్సులు కానీ ఏమీ లేవు, వీళ్ళు ఆర్టిఫిషియల్ గా చేశారు.. ఎంత క్రియేటివిటీ అంటే నిజం జలపాతాల్లో వాటికి దగ్గరగా వెళితే నీళ్ళు పడతాయి కదా, అది కూడా ఏర్పాటు చేశారు దీంట్లో!!



ఇక ఆ తరువాత భోజనం... ఎవర్లాండ్ అవడానికి చాలా పెద్దది కానీ, తినడానికి ఏమీ దొరకలేదు. ఇలా అనడం కంటే కూడా వెజిటేరియన్ దొరకలేదు అని చెబితే ఇంకా కరెక్ట్ గా ఉంటుంది.. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ ఎక్కడా వెజిటేరియన్ లేదు. తిరిగి తిరిగి ఒకచోట చిప్స్ దొరుకుతాయని తెలిసి ఇక అక్కడ కాస్త తిన్నాం.. చూడండి మా లంచ్ ఇదే! :(




మా టీంలో మిగతా వాళ్ళు నాన్-యాచీస్(Non-Vegiterian in korean) సో వాళ్ళు ఆ రోజు అక్కడ మంచి పట్టు పట్టారు.. అలా వాళ్ళు తిండి మీద పూర్తిగా నిమగ్నమయ్యేసరికి మేము సర్లే కాస్త మన కెమెరాకి పని చెబుదామని బయటకి వచ్చాము..

ఆ ప్రక్కనే పూల తోట.. నాకైతే చూడడానికి రెండు కళ్ళూ సరిపోలేదు!.. ఎంత బావుందో అసలు అక్కడే ఉండిపోవాలనిపించేంతగా...! అలా ఒక్కో పూవుని కెమెరాలో బంధిస్తుండగా, ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో జనాలందరూ వచ్చి అక్కడున్న బెంచీల మీద కూర్చోవడం మొదలు పెట్టారు.. మొదట అర్ధం కాలేదు.. ఒక్కసారిగా వీళ్ళందరికీ ఏమైందబ్బా అందరూ ఇప్పుడే ఇక్కడే రిలాక్స్ అవ్వాలా అనుకుని ప్రక్కనే ఉన్నామెని అడిగాను ఏంటిదంతా అని.. అప్పుడు ఏదో పప్పెట్ షో ఉందట, దాని కోసం అని చెప్పింది.. ఆ ఏముంది లే ఎన్ని చూడలేదు ఇలాంటివి అనుకుని పట్టించుకోలేదు.. ఇంకా పూలలోనే మునిగిపోయాను.. ఇంతలో మాంచి మ్యూజిక్ మొదలయ్యింది.. ఇదేదో బానే ఉంది అని చూద్దామని ఇవతలకి వచ్చాను.. ఆ గార్డెన్ లో పూలు ఎంత బావున్నాయో, వాటికంటే ఈ షో అంత బావుంది.. ఒక 15నిమిషాల పాటు జరిగింది, చాలా చాలా చాలా బావుంది... మొత్తం వీడియో తీసాను.. చాలా బాగా వచ్చింది...



తరువాత ఒక రైడ్ కి వెళ్ళాం.. దాని పేరు TExpress(తెలంగాణా ఎక్స్ ప్రెస్స్ కాదు!).. చాలా పెద్ద క్యూ ఉంది.. కింద క్యూలో నించుంటే దాంట్లో వెళుతున్న వాళ్ళ హాహాకారాలు వినిపిస్తున్నాయి!! అసలు ఆ రైడ్ క్రింద నుండి చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది.. మనం కూర్చున్న సీట్ కాస్త అటు-ఇటూ అయినా ఇక అంతే.. కనీసం మన బాడీ కూడా దొరకదు! ఆ అడవిలో దొరికే ఛాన్స్ కూడా లేదు.. అంత ఇదిగా ఉన్నా కూడా ఫర్లేదు సాహసం సేయరా ఢింబకా అని ఉదయభాను చెబుతోంది కదా అని ప్రొసీడ్ అయ్యాం. దగ్గర దగ్గర గంట నించున్న తరువాత మా వంతు వచ్చింది.. స్టార్ట్ అయ్యింది.. ఇది కూడా పైకి వెళ్ళేటప్పుడు చాలా నెమ్మదిగా వెళుతూ ఉంది.. జనాలు ఎవరూ ఏమీ శబ్దం చేయట్లేదు.. తుఫాను ముందర ప్రశాంతతలాగా ఉంది.. టాప్ మోస్ట్ పాయింట్ లో ఉన్నాం.. ఇక ఏ క్షణం లో నైనా క్రింద పడచ్చు అని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా వేగం పుంజుకుంది.. అంతే రయ్యిన దూసుకుపోయింది... ఎంత వేగం అంటే, తల మన ప్రమేయం లేకుండానే క్రిందకి వేలాడిపోతోంది.. ఎంత పైకి లేపుదామన్నా రావట్లేదు.. ఇంతలో కొంచెం స్పీడ్ తగ్గింది.. హమ్మయ్య అని కాస్త తలెత్తేలోపే మళ్ళీ ఇంకోటి... ఇలా మూడు రౌండ్లు... మొదటి రౌండ్ కి కాస్త అలవాటు పడ్డాం.. సో మిగిలిన రెండు రౌండ్లు బాగా ఎంజాయ్ చేశాం! నిజంగా చాలా మంచి ఎక్స్ పీరియన్స్.. దిగిన తరువాత మళ్ళీ ఎక్కాలనిపించింది కానీ పెద్ద క్యూ ఉండడంతో ఇక వచ్చేశాం.. దానికి సంబందించిన వీడియో ఇక్కడ చూడండి..



ఇక ఆ తరువాత జంగిల్ ఎక్స్ ప్రెస్స్... ఇది రొటీన్ కి భిన్నమైనది.. అన్నిటికీ పైన మనం ఉంటాం, క్రింద వీల్స్ ఉంటాయి కదా, కానీ దీనికి మాత్రం రివర్స్ అనమాట.. పైన చక్రాలు ఉంటాయి, క్రింద మనం ఉంటాం.. అంటే మనల్ని తిరగదిప్పి త్రిప్పేస్తుందనమాట! ఇది కూడా చాలా బావుంది!

కానీ ఆ T Express ఎక్కిన తరువాత ఈ జంగిల్ express ok మిగతావన్నీ మాత్రం చాలా పిల్ల రైడ్స్ లాగా అనిపించాయి.. అసలు ఇక GaintWheel ఐతే లెక్కలోకి రాలేదు!

అలా దాదాపు అన్ని రైడ్స్ అయిపోయాయి.. ఇక ఆఖరి అంకం.. డాషింగ్ కార్స్.. దానికి కూడా వెళ్ళాం.. మంచిగా కాసేపు డ్రైవింగ్ ప్రాక్టీసు చేసుకుని బయటకి వచ్చాం!

ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ఇంకోటి.. ప్రతి రైడ్ దగ్గరా, చేంతాడంత లైన్స్ ఉన్నాయి కానీ, మనం ఇంకా ఎంతసేపు లైన్ లో నించోవాలో చూపిస్తూ ఉంటారు.. చెప్పిన దానికి నిమిషం అటూ-ఇటూ కాకుండా మన వంతు వస్తుంది! Its really amazing..

అప్పటికే తొమ్మిదవుతోంది.. అందరం బాగా అలసిపోయాం... ఇంకొక గంట ఉంటే క్రాకర్స్ షో ఉంది అని చెప్పారు కానీ, అంత ఓపిక లేక ఇక వచ్చేశాం... బస్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ కూర్చుని ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను.. అంతే, ఏదో రైడ్ లో వెళుతున్న ఫీలింగ్... అలా మా ఎవర్లాండ్ ట్రిప్ ముగిసింది...

మన వండర్ లా ఎవర్లాండ్ కి ఏ మాత్రం సరిపోకపోయినా, ఈ దిల్ మాత్రం జైజైజైజైజై భారత్!!!

13 comments:

ప్రపుల్ల చంద్ర said...

టెంప్లెట్ చాలా బాగుంది మేధ. కబుర్లు కూడా.

oremuna said...

బాగున్నాయి మీ కబుర్లు.

ఏమిటి ఆడోళ్లంతా కూడబలుక్కోని ఏ కూడలి కబుర్లల్లోనో ? టెంప్లేట్లు మారుస్తున్నారా? అన్నీ అందంగానే ఉంటుంన్నాయి.

Unknown said...

హమ్మయ్య... ఈ సారి మనసు నిండే టపా రాసారు. ఫోటోలు, దానితో పాటు అనుభవాలు చక్కగా కుదిరాయి.

మీ రైడ్ల గురించి చదువుతుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది.

Kathi Mahesh Kumar said...

టెంప్లెట్ అదిరింది...కాదుకాదు...టపా అదిరింది...కాదుకాదు...రెండూ అదిరాయి!

Purnima said...

మన ఇద్ద్రరం కాఫీ తాగుతుంటే మీరు పక్కన కూర్చుని కబుర్లు చెప్తుంనట్టు ఉంది. చాలా బాగుంది.. టెంప్లేట్ కి తగ్గట్టు.. టపా!! టపా కి తగట్టు టెంప్లేట్!!

కొత్త పాళీ said...

చాలా బావుంది.
ఇలాంటి పర్యాటన విశేషాలతో పాటు అక్కడ ఆఫీసులోనూ, బయటా (షాపులు, రెస్టరాంట్లు, ఐర్పోర్టులు, వగైరా) మీరు గమనించిన సాంఘిక సాంస్కృతిక విషయాలు కూడా రాయండి. ఇలా ఇంకో దేశ ప్రజల గురించి తెలుస్కోవడం బావుంటుంది.
సత్యసాయి మేస్టారు అక్కడ వివిలో కొన్నాళ్ళు పాఠం చెప్పారు. ఆయన కొరియా అనుభవాల్నీ నా అమెరికా నుభవాల్నీ తలుచుకుని చెప్పుకున్న కబుర్లు పొద్దు పత్రికలో జనవరిలో మూడు భాగాలుగా వచ్చాయి.

వేణూశ్రీకాంత్ said...

టపా బావుంది మేధ గారు...ఇలాంటి థీం పార్క్ లన్నీ తిరిగినంత సేపు చాలా బావుంటాయ్ కానీ సాయంత్రానికే సినిమా కనపడుద్ది.... అన్నట్లు టెంప్లేట్ అదుర్స్..

ramya said...

బావుందండీ, అందరూ ట్రావెలోగ్ రాసేస్తున్నారు, ఎంచక్కా, వెళ్ళకుండానే అక్కడ తిరిగేస్తున్నాం.

మేధ said...

@ప్రపుల్లచంద్ర, @ఒరెమునా గారు: టెంప్లేట్ నచ్చినందుకు, అలానే కబుర్లు నచ్చినందుకు నెనర్లు...

@ప్రవీణ్ గారు: అయితే వండర్ లా లో అవన్నీ పెట్టమని రికమెండ్ చేసెయ్యండి!

@మహేష్ గారు: మీ కామెంట్ అదుర్స్.. కాదు కాదు.. కాంప్లిమెంట్ అదుర్స్.. కాదు కాదు.. రెండూ అదుర్స్... :)

@పూర్ణిమ: ఏంటి ఇంకా ఇండియాలోనే ఉన్నారా.. నేను ఇంకా మీరు వచ్చేస్తారని ఇక్కడ ఆల్రెడీ కాఫీడే లో టేబుల్ రిజర్వ్ చేసేశానే!!! బేగ బన్ని...

@కొత్తపాళీ గారు: తప్పకుండా.. రాయాడానికి చాలా విషయాలున్నాయి.. అవన్నీ త్వరలోనే రాస్తాను.. మీ కబుర్లు అప్పుడు పొద్దు లో చదివాను...

@వేణు శ్రీకాంత్ గారు: టెంప్లేట్ నచ్చినందుకు థాంకులు... అవునండీ ఆ అలసట తీరడానికి రెండు రోజులు పట్టింది!

@రమ్య గారు: అయితే మీ కబుర్లు ఎప్పుడు మొదలుపెట్టబోతున్నారు..?!

సుజాత వేల్పూరి said...

హాయ్ మేథా,
బాగుందోయ్ ట్రావెలాగ్! రమ్య గారు చెప్పింది నిజమే! అందరూ ట్రావెలాగ్ తప్పక రాయాల్సిందే! అలా అన్ని వూళ్ళూ, ప్రదేశాలు తిరగడం భలే బాగుంటుంది కదా!

పాపం సింహాలకు కూడా వివక్ష అంటగట్టి వచ్చారా అయితే!

రవి said...

చిన్నపిల్లలు బెదిరించడం : మాకూ ఇలాంటి అనుభవం ఎదురయ్యింది, అక్కడ.
కొరియా సిం హపు బొమ్మలు : చిన్న చిన్న కళ్ళతో, కొరియా సిం హాల లాగే ఉన్నాయి.
వెజిటేరియన్ భోజనం : మాకూ దొరక్క చచ్చాం. ఒక స్టేజులో నాన్ వెజ్ కూడా తినవలసి వచ్చింది. ఇంకో సంగతి. కొరియాలో, నాన్ వెజ్ అయినా తినండి కానీ పొరబాటున వెజిటేరియన్ ఫుడ్ ట్రై చేయకండి. భయంకరం.
మీ బ్లాగు కొత్త టెంప్లేటు అదిరింది.

Vamsi Krishna said...

Medha: "కనీసం పెద్ద ముండావాళ్ళమని కొంచెం కూడా గౌరవం లేకుండా, మా మీద జోకులు.. ఇక-ఇకలు పక-పకలు.. ఆ కొరియన్ భాషలో ఎన్ని రకాలుగా కామెంట్లు చేసుకోవాలో అన్ని రకాలుగా చేసేశారు ఆ కాసేపట్లో... బెంగళూరులో ఆటో వాళ్ళు కూడా ఇంత అవమానించలేదు నన్నెప్పుడూ!! చివరికి LKG పిల్లలకి కూడా లోకువయిపోయాము మేము.. ఊరికే హాయి చెబితే చూడండి ఎలా బెదిరిస్తోందో!!!"

పెద్ద ముండావాళ్ళమని, బెంగళూరులో ఆటో వాళ్ళు anna rendu words ednukoo chaala nacheseyi...
mee peeru ippudu type chesthoo vundaga oka doubt vachindi...mee poorthi medha anthey naa??

mee narrative style chala baagundi...although its abt a place...livelyga vundi...

మేధ said...

@సుజాత గారు: నా ట్రావెలాగ్ నచ్చినందుకు నెనర్లు...
అవునండీ యధా రాజా తధా ప్రజా అన్నారు కదా... ఎంత కొరియాలో ఉన్నా ఆంధ్రా అమ్మాయిని కదా! కాబట్టి వాళ్ళు ప్రాణం లేని దిష్టి బొమ్మలని వివక్ష ఆపాదిస్తున్నారు.. నేను ప్రాణం ఉన్న సింహాలకి అంటగడుతున్నాను వివక్ష!

@రవి గారు:
చిన్న పిల్లలు: అయితే వాళ్ళ బారిన పడిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారనమాట.. ;)

కొరియా సింహపు బొమ్మలు: ఇక్కడ ఎవరిని చూసినా అంతే కదా.. చివరికి జంతువులు కూడా అదే టైప్!

ఇక భోజనమంటారా, నాన్-వెజ్ తినలేము.. ఏదో ఆకులు అలములైనా వెజిటేరియనే తినాలి.. అయినా మాకు ఇండియన్ గెస్ట్ హౌస్ ఉంది కాబట్టి రోజు తినడానికి ఇబ్బంది లేదు.. ఇదిగో ఇలా ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు.. ఇక అంతే ఏం చేస్తాం .. స్వల్ప అడ్జస్ట్ మాడాల్సిందే.... :)

నా బ్లాగ్ టెంప్లేట్ నచ్చినందుకు రొంబ థాంక్స్...!

@వంశీ కృష్ణ గారు: నా శైలి నచ్చినందుకు పెరియా థాంకులు...
నా పేరు మేధా మాత్రమేనండీ...