Monday, September 17, 2007

ఎందరో మహానుభావులు – 3

పోయిన వారం సంగీత సాహిత్యాలలో, విప్లవకారుడిగా ప్రసిధ్ధి గాంచిన “శ్రీ దాసు శ్రీరాములు” గురించి తెలుసుకున్నాం కదా.. ఈ వారం దూర్వాసుడి లాంటి బొబ్బిలి కేశవయ్య గారి గురించి తెలుసుకుందాం…

కేశవయ్య గారు గోపాలయ్య, రంగనాయకమ్మ దంపతులకి జన్మించారు.. తన తండ్రి గారి వద్దనే సంగీతాన్ని అభ్యసించారు.. ఆయనకి ఉన్న పాండిత్యం వలన, అతి పిన్న వయసులోనే బొబ్బిలి ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు.. ఐతే అనుకోకుండా వారి తల్లిగారు కాలం చేశారు.. కేశవయ్య గారు మొదలు నరికిన చెట్టులా కూలిపోయారు.. అసలు సంగీతం వైపు చూడడం లేదు.. ఇదంతా చూసిన రాజు గారు బాధపడ్డారు.. కేశవయ్య గారిని ఇలానే వదిలేస్తే ప్రమాదకరమని భావించిన ఆయన, మార్పుగా ఉంటుందని వేరే ఆస్థానాలకి పోటీలకి పంపడం ఆరంభించారు..

ఎంత బాధలో ఉన్నా, విద్య ఎక్కడికీ పోదు కదా.. పోటీలకంటూ వెళ్ళిన తరువాత, వెనుదిరిగి చూడడమనేది బొబ్బిలి వారి చరిత్రలోనే లేదు కదా.. ఇక అప్పటినుండీ, బెబ్బులిలాగా విజృంభించారు కేశవయ్య గారు..

వేరే ఆస్థానాలకి వెళ్ళడం, అక్కడి వాళ్ళందరిని పోటీకి రమ్మని ఆహ్వానించడం, పోటీలో వారిని చిత్తుగా ఓడించి అక్కడి వారి ప్రశంశలు, బహుమతులు అందుకోవడం ఇలా జరుగుతూ ఉండేది..

ఐతే, కేశవయ్య గారితో పోటీలో పాల్గొనాలంటే, ముందు ఆయన పెట్టే షరతులకి ఒప్పుకోవాలి.. అదేమంటే ఓడిపోయిన వారు, వాళ్ళ తంబూర, బిరుదులు అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోవాలి.. కేశవయ్య గారికి ఉన్న పట్టువలన, ఆయనని ఓడించడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు.. ఎలాంటి కళాకారుడికైనా తంబూర ఇవ్వడం అంటే, తన ప్రాణానికి ప్రాణమైన సంగీతాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టడమే కదా.. పాపం కొంతమంది సున్నిత మనస్కులు, ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకునేవారు.. కానీ ఇవేవీ కేశవయ్య గారికి పట్టేవి కాదు.. తను పెట్టిన షరతుల వలన, మనుష్యుల ప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నా ఆయన కొంచెం కూడ చలించేవారు కాదు.. ఎక్కడ పోటీ జరిగినా అక్కడికి వెళ్ళడం, అందరినీ ఓడించడం, వాళ్ళ తంబూరాలని, బిరుదులని లాక్కొచ్చేయడం సర్వ సాధారణమైపోయింది ఆయనకి.. ఏ పోటీకి వెళ్ళిన ఇదే తంతు.. అందుకే కేశవయ్యగారు “ప్రళయకాల ఝుంఝుంమారుతం”, “గాన కేసరి” లాంటి బిరుదులు పొందారు.. భూలోకంలో ఉన్న కళాకారులందరినీ చాప చుట్టినట్లు చుట్టేస్తుండడం వలన ఆయనని “భూలోక చాప చుట్టి కేశవయ్య” అని కూడా పిలిచేవారు…

ఎంత విద్వత్తు ఉన్నా, అహంకారంతో కూడిన విద్య ఎప్పుడోకప్పుడు దెబ్బ తినాల్సిందే.. కేశవయ్యగారి విషయంలో కూడా అదే జరిగింది.. భూలోకాన్ని మొత్తం చాప చుట్టేస్తున్న కేశవయ్యగారు, తంజావూరులో అడుగు పెట్టారు.. అప్పట్లో తంజావూరు సంగీత సాహిత్యాలకి పెట్టింది పేరు.. కానీ షరా మాములుగా కేశవయ్య గారు ఆస్థాన విద్వాంసులని హడలగొట్టేస్తున్నారు.. అది చూసి తులజాజీ మహారాజు గారు కంగారుపడిపోయారు.. పరుగు పరుగున వెళ్ళి శ్యామశాస్ట్రిగారి కాళ్ళ మీద పడ్డారు.. ఆస్థానానికి రమ్మని వేడుకున్నారు.. కానీ శ్యామశాస్త్రిగారు ససేమీరా అన్నారు.. ఆస్థానాలలో నేను పాడను అని తెగేసి చెప్పారు.. ఐనా రాజా వారు పట్టు విడవలేదు.. ఆస్థాన పరువు ప్రతిష్టలు కాపాడాలి అని శ్యామశాస్త్రిగారిని ఒప్పించారు.. ఇక రాజు గారి మాట తీసేయ్యలేక, కామాక్షి దేవి గుడికి వెళ్ళి ఆమెని “దేవీ సమయమిదే(చింతామణి రాగం)” లో స్తుతించి పోటీకి బయలుదేరారు..

పోటీ మొదలయ్యింది.. వికటాట్టహాసం చేస్తున్నారు కేశవయ్యగారు.. అటు వైపు ప్రసన్న వదనంతో శ్యామశాస్త్రిగారు.. “సింహనందన తాళంలో“ పాటని ఆరంభించారు కేశవయ్యగారు.. పాట అయిపోయింది.. సభ మొత్తం స్థాణువైపోయింది.. మరి అంత జగన్మోహనంగా చేశారు కచేరీ.. మహారాజు గారు భయభయంగా శ్యామశాస్త్రి గారి వైపు చూశారు.. తన ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుని, గొంతు సవరించుకుని, “శరభ నందన” తాళంలో మొదలుపెట్టారు.. ఈ సారి అవాక్కవడం కేశవయ్య గారి వంతైంది.. శ్యామశాస్త్రి గారు ఆ సంగీత సరస్వతికి స్వరాభిషేకం చేస్తున్నారు.. నటరాజు, విష్ణుమూర్తి, కామాక్షి దేవి, ఇలా ఒకరేమిటి అందరూ కనిపిస్తున్నారు ఆయనలో… బిత్తరపోయింది ఆ ప్రళయకాల ఝుంఝుంమారుతం.. తెలియకుండానే కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి.. అప్పటివరకు అహంకారంతో మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి.. తన కన్నిటితో శ్యామశాస్త్రి గారికి పాదాభిషేకం చేశారు కేశవయ్య గారు…

చూశారా ఎంత తెలివితేటలున్నా, ఎంత గొప్పవారైనా వినయంలేని విద్య శోభించదు అని మనకి కేశవయ్యగారి జీవిత చరిత్ర ద్వారా తెలుస్తుంది కదా..

2 comments:

విహారి(KBL) said...

బాగుంది.మీరు చెప్పిన విధానం ఇంట్రెస్టింగ్ గా చదివింపచేసింది.

మేధ said...

థ్యాంక్సండీ విహారి గారు