Friday, September 7, 2007

రామునికి సీత ఏమవుతుంది…?

రామునికి సీత ఏమవుతుంది…? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే వాళ్ళకేమి తెలియదు, వాళ్ళు వట్టి మూర్ఖులు అని మనలో చాలామందికి సాధారణం గా ఉన్న అభిప్రాయం.. నిజం చెప్పాలంటే నేను కూడ ఒక రెండు మూడు నెలల క్రితం వరకు ఇదే అభిప్రాయం తో ఉండేదాన్ని.. ఐతే అప్పుడు అనుకోకుండా ఆరుద్ర గారు రాసిన “రాముడికి కి సీత ఏమవుతుంది” అనే పుస్తకం చడవడం జరిగింది.. దాంట్లో ఉన్న విషయాలన్నీ ఏకీభవించలేకపోయినా, చరిత్రలో ఇన్ని రామాయణాలు ఉన్నాయా, మనకి తెలియకుండా చరిత్రని ఇంత మార్చేశారా అని అనిపిస్తుంది…!

మనకి వాల్మీకి, రాసిన “శ్రీ మద్రాంధ్ర రామాయణం” మూల విరాట్టు.. కానీ వాల్మీకి రామాయణం రాయడం మొదలు పెట్టకముందే చాలా రామాయణ గాధలు ప్రాచుర్యం లో ఉన్నాయి.. వాటిల్లో చాలా పేరెన్నిక గన్నవి “జైన, బౌధ్ధ రామాయణాలు”..

ముందుగా బౌధ్ధ రామాయణం లో ఉన్న కధలని తెలుసుకుందాం.. బౌధ్ధ రామాయణం లోని రెండు కధలకి, మన రామాయణం కి చాలా పోలికలు కనిపిస్తాయి.. అవి (1) పేరు తెలియని రాజు కధ (2) దశరధ జాతకం
మొదటిగా పేరు తెలియని రాజు కధని గురించి తెలుసుకుందాం..

పేరు తెలియని రాజు కధ:

బుధ్ధుడి పూర్వజన్మలోని కధ ఇది.. ఆ జన్మలో పేరు తెలియదు అందుకే కధ పేరు “పేరు తెలియని రాజు కధ”.. మనం చెప్పుకోవడానికి వీలుగా, ఆ రాజు పేరు బోధిసత్వుడు అని అనుకుందాం.. రాజు అన్నాక రాణి కూడా ఉంటుంది కదా.. సరే బోధిసత్వుడు అలవాటు ప్రకారం జనరంజకం గా పరిపాలిస్తూ ఉంటాడు.. ఐతే ఈయన రాజ్యం ప్రక్కనే బోధిసత్వుడి మేనమామ కూడా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు.. ఈయన మహా క్రూరుడు, దురాశాపరుడు.. అత్యాశతో, బోధిసత్వుడి రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో కలిపేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.. అసలే బోధిసత్వుడు అహింసా పరుడు.. అందుకని, ఈ గొడవలు పడలేక, యుధ్ధాలు చేయలేక రాజ్యాన్ని మంత్రులకి అప్పగించి, తన రాణి ని తీసుకుని అడవులకి వెళ్ళిపోతాడు.. (కధ ఇలా సాగితే మన తెలుగు వాళ్ళకి అసలు నచ్చదు.. హీరో ప్లేస్ లో ఎవరున్నా ఫైటింగ్ చేయాలి తప్ప, ఇలా ప్రశాంతం గా గడపకూడదు…!)

అదే అడవిలో దుష్టుడైన ఒక నాగుగు ఉన్నడు.. (విలన్ ఎంట్రీ) రాణి అందచందాలు చూసి ఆమెని ఎలాగైనా తనదాన్ని చేసుకోవాలనే దుర్బుద్దితో, మాయా వేషదారియై (ముని వేషం లో) బోధిసత్వుని కి ఉపచారాలు చేస్తూ ఉంటాడు.. ఒకరోజు, బోధిసత్వుడు ఏదో పని మీద, బయటకు వెళ్ళగా, ఆదను చూసి ఆ నాగుడు రాణి ని బలవంతంగా తన తో తీసుకువెళతాడు.. మార్గ మధ్యంలో, పెద్ద పెద్ద రెక్కలున్న ఒక పక్షి అడ్డగిస్తుంది కానీ దాన్ని అశక్తురాలిని చేసి రాణిని తనతో, తీసుకువెళ్ళిపోతాడు ఆ నాగుడు..

ఇక్కడ ఏమో ఆశ్రమానికి తిరిగి వచ్చిన బోధిసత్వుడికి రాణి జాడ కనపడకపోవడం తో, తనని అన్వేషిస్తూ బయలుదేరతాడు.. అలా వెళ్తూ ఉండగా, ఒకచోట దు ంఖ సాగరం లో మునిగి ఉన్న వానరుడు కనిపిస్తాడు.. బోధిసత్వుడు అతనిని సమీపించి, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడుగుతాడు.. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ వానరుడి మేనమామ అతని రాజ్యాన్ని అన్యాయంగా అనుభవిస్తూ ఉంటాడు.. షరా మామూలుగా మన హీరో బోధిసత్వుడు సపోర్టింగ్ యాక్టర్ కి తన వంతు సహకారం అందిస్తాడు.. హీరో ప్రక్కన ఉన్నవాళ్ళదే గెలుపు కాబట్టి, వానరుడు తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు.. వానరుడు తన వంతు సహాయం గా, బోధిసత్వుడి రాణిని వెతకడానికి తన వానర సైన్యాన్ని పంపిస్తాడు.. ఆ వానరులు రాణి గురించి వెతుకుతూ ఉండగా, మధ్యలో రెక్కలు తెగి కొన ఊపిరితో పడి ఉన్న పక్షి కనిపిస్తుంది.. దాని ద్వారా, రాణిని నాగుడు ఎత్తుకుపోయి, సముద్రం కి ఆవల ఉన్న ఒక లంక లో దచిపెట్టడని తెలుస్తుంది.. ఇవన్నీ తెలుసుకున్న బోధిసత్వుడు, వానర సైన్యం సహాయంతో, సముద్రం మీద వారధి కట్టి, ఆ నాగుడిని జయించి రాణిని విడిపించుకుని తీసుకు వస్తాడు.. ఇది అంతా అయ్యేసరికి, బోధిసత్వుడి మేనమామ, అనారోగ్యంతో మరణిస్తాడు.. దాంతో వానరులు వాళ్ళ రాజ్యానికి, బోధిసత్వుడు తన రాజ్యానికి చేరుకుంటారు..

అక్కడితో కధ అయిపోలేదు.. ఇంకా కొంచెం ఉంది.. బోధిసత్వుడు తన భార్యతో, నువ్వు ఇంత కాలం నా దగ్గర లేవు కదా.. ప్రజలు నిన్ను అనుమానిస్తారు అంటాడు.. దానికి ఆవిడ నేను కనుక పవిత్రురాలిని ఐతే, ఈ భూమి రెండు గా చీలిపోతుంది అని అంటుంది.. ఎంతైనా ఆవిడ పవిత్రురాలు కాబట్టి భూమి చీలిపోతుంది.. దాంతో బోధిసత్వుడు తిరిగి ఆమెని చేపడతాడు.. ఇక తరువాత తన రాజ్యాన్ని ప్రజారంజకం గా పరిపాలిస్తాడు..


ఇదీ స్థూలంగా “పేరు తెలియని రాజు కధ”….. పెధ్ధ పరెశీలించనవసరం లేకుండానే, మన రామాయణానికి దీనికి చాలా పోలికలు కనిపిస్తాయి….

ఉదాహరణకి, వాల్మీకి రామాయణం లో, సవతి తల్లి వల్ల వనవాసానికి వెళితే, బౌధ్ధ రామాయణం లో, మేనమామ ఆగడాలు భరించలేక వెళ్తాడు..

దాంట్లో, రావణుడు సీతని అపహరిస్తే, దీంట్లో నాగుడు అపహరిస్తాడు.. ఇంకో పొలిక కూడ ఉంది.. ఇద్దరూ ముని వేషం లోనే వస్తారు…

రెండిటిలోనూ, వానర సైన్యం సహాయంతోనే, సముద్రం మీద సేతువుని కడతారు..

రాముడు, బోధిసత్వుడు ఇద్దరూ తమ తమ రాణులని అనుమానిస్తారు… అగ్నిలోకి దూకమని ఒకరంటే, భూమిని చీల్చమని మరొకరంటారు…

మిగిలిన రెండో కధను తరువాత చూద్దాం..

15 comments:

, said...

మేధ గారు, మీకు రెండు విషయాల్లో ధన్యవాదాలు చెప్పాలి. 1. మీరు చాలా ఓపిగ్గా , ఇంత వివరంగా రాస్తున్నందుకు. 2. మీరు చాలా మంచి విషయాలు విడమర్చి చెబుతున్నందుకు.
ఎందుకంటే, ఒక దేశం గాని, ఒక జాతికి గాని తమ ఇతిహాసాల గురించి , చరిత్ర గురించి గానీ పూర్తిగా అవగాహన వుంటే ఆ దేశం గాని జాతి గాని పురోగతి సాధిస్తుంది. చివరగా 'వ్యవస్థను కాపాడిన రాముడు ' అనే ఓ అథ్బుతమైన పుస్తకం చదివాను. దాని గురించి సంక్షిప్తంగా వివరిస్తాను. రామాయణం లోని ప్రతి పాత్ర యొక్క ఔచిత్యం, కల్పించబడ్డ అవసరం గురించి చాలా వివరణలు వున్నాయి. ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో వొదిలేసిన కొన్ని అభ్యంతరకరమైన విషయాల గురించి వివరించారు రచయుతగారు.

రాధిక said...

ఒక కొత్త విషయాన్ని తెలియచేసారు.మిగిలిన వాటి గురించి ఎదూచూస్తున్నాను.

విశ్వనాధ్ said...

నిజంగానే మీకు ఓపిక ఎక్కువ.మంచి విషయాలతో పెద్దపెద్ద పోష్టులు భలే రాసేస్తున్నారు.

విహారి(KBL) said...

viswanathgaru correct ga chepparu.

కొత్త పాళీ said...

Good job with the long narration.

Yes, there are many Ramayanas. Late poet and scholar A.K. Ramanujan believed so strongly in the plurality of Ramayana tradition that he spoke and wrote extensively about it. In fact, a paper published by him gave inspiration to a collection of scholarly essays called "Many Ramayanas", edited by Professor Paula Richman. It was published in India by Oxford University Press.

మేధ said...

అందరికీ ధన్యవాదాలండీ.. అసలు నేను ఈ టపా వ్రాసేటప్పుడు కొంచెం భయపడ్డాను కూడా.. ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని.. కానీ ఇప్పుడు ఆ భయం పోయింది.. నాకు తెలిసిన సమాచారాన్ని మొత్తం మిగతా టపాలలో చెబుతాను..

Bhãskar Rãmarãju said...

"మనకి వాల్మీకి, రాసిన “శ్రీ మద్రాంధ్ర రామాయణం” మూల విరాట్టు.. కానీ వాల్మీకి రామాయణం రాయడం మొదలు పెట్టకముందే చాలా రామాయణ గాధలు ప్రాచుర్యం లో ఉన్నాయి.. వాటిల్లో చాలా పేరెన్నిక గన్నవి “జైన, బౌధ్ధ రామాయణాలు”.."

నాదొక చిన్న ప్రశ్న:
రామాయణ కాలమ్లో,కన్నా ముందే ఉన్నాయా బౌధమతం, జైన మతం?
నాకు తెలిసినంతవరకు (నాకు తెలుసు నా జ్ఞానం చాలా తక్కువ అని) రామాయణం అన్నిటికన్న ముందుది. రామాయణం, భారతం లాంటి కధలు చాలా ఉండి ఉండొచ్చు. మా వీరపల్నాటి చరిత్ర దాదాపు భారతం లాంటిదే.

మేధ said...

@భాస్కర రామరాజు గారు: ఇప్పుడు లభ్యమయ్యే తేదీల ప్రకారం చూస్తే, బౌద్ధమతం హిందూమతం తరువాత కనిపిస్తుంది.. కానీ బౌద్ధ రామాయణంలోని కధలని పరిశీలిస్తే, అవి వాల్మీకి వ్రాయడం మొదలు పెట్టడం కన్నా, ముందే వ్రాసినట్లు తెలుస్తుంది.. మనకి విష్ణుమూర్తి దశావతారాలు ఎలా ఐతే ఉన్నాయో, అలానే బుధ్ధుడికి కూడా చాలా అవతారాలు ఉన్నాయి.. నేను ఇక్కడ ప్రస్తావించిన కధ అలాంటి ఒక అవతారం లోనిది..

ఇక జ్ఞానం విషయానికి వస్తే, నాకు కూడా ఏమీ తెలియదండీ, ఏదో పుస్తకాలు చదివి ఈ విషయాలు తెలుసుకున్నాను..

Bhãskar Rãmarãju said...

బాగుంది. మీ పేరుని సార్ధకం చేసుకుంటున్నారు. ఎంతైనా పల్నాటి నేల మహత్యం.

మనోహర్ చెనికల said...

Thanks for giving such information
There is a book "Vande valmiki kokilam" which erveals true identity of valmiki and his ramayana.It may help you in your research

మేధ said...

@మనోహర్ గారు: సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు.. అయితే కాస్త ఆ పుస్తకం రచయిత ఎవరో కూడా చెప్పండి..

Sriram said...

వాల్మీకి --> “శ్రీ మద్రాంధ్ర రామాయణం”
ఏదో తేడా గా అనిపించట్లా??

మేధ said...

@శ్రీరామ్ గారు: అక్కడ నా ఉద్యేశ్యం తెనిగీకరించిన వాల్మీకి రామాయణం అని...

Kathi Mahesh Kumar said...

నాకూ ఇలాంటి కథ ఒకటి తెలిసింది. ఇప్పుడే బ్లాగులో పెట్టి మీ బ్లాగుకీ లంకెవేసా. చూడండి.
http://parnashaala.blogspot.com/2009/05/blog-post_07.html

Praveen Mandangi said...

బైబిల్, ఖురాన్ లలో కూడా ఒకదానికొకటి పొంతనలేని కథలు అనేకం ఉన్నాయి.

>>>>>
1. తోబితు
2. యూదితు
3. మక్కబీయులు1
4. మక్కబీయులు2
5. సొలోమోను జ్ఞానగ్రంధము
6. సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము
7. బారూకు
>>>>>
ఈ గ్రంథాలని కాథొలిక్ క్రైస్తవులు నమ్ముతారు కానీ ప్రొటెస్టంట్ క్రైస్తవులు నమ్మరు.

ఏసు క్రీస్తు బాల్యం గురించి అరబ్బీయులు వ్రాసిన సువార్తని Canonical Bible నుంచి తొలిగించారు కానీ ఆ సువార్తలోని కొన్ని వచనాలని ఖురాన్ లో చేర్చడం జరిగింది. దాన్ని ఇంగ్లిష్ లో Arabic Infancy Gospel అంటారు.

హనోక్ గ్రంథం (Book of Enoch) ని ఎథియోపియా ఆర్థొడాక్స్ క్రైస్తవులు మాత్రమే నమ్ముతారు కానీ ఇతర క్రైస్తవ శాఖలవాళ్ళు మాత్రం నమ్మరు.

ఏసు క్రీస్తు గురించి బర్నబాస్ వ్రాసిన సువార్త (Gospel of Barnabas) ని క్రైస్తవులు నమ్మరు కానీ ముస్లింలలో ఒక వర్గం వాళ్ళు మాత్రం నమ్ముతారు.

రామాయణం లాగే ఇతర మత గ్రంథాలలో కూడా ఒకదానికొకటి పొంతనలేని కథలు, వచనాలు ఉన్నాయి.