Friday, September 21, 2007

రాముడికి సీత ఏమవుతుంది…?

పోయిన వారం బౌధ్ధ రామాయణం లోని కధలని తెలుసుకున్నాం కదా..ఈ వారం ఖోటాన్ రామాయణం లోని కధల్ని తెలుసుకుందాం…

పూర్వం దశరధుడనే రాజు జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు.. అతనికి ఒక కుమారుడు, అతని పేరు “సహస్ర బాహువుడు”.. ఇతను ఎన్నో యుధ్ధాలలో రాజ్యానికి విజయాన్ని చేకూర్చాడు.. ఒకసారి తన పరివారంతో వేటకి వెళతాడు.. అక్కడ విశ్రమించడానికి తగిన వసతి కోసం చూస్తుండగా, ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు.. అతనిని సహాయంకై అర్ధించగా, ఆ బ్రాహ్మణుడు తన దగ్గరనున్న కామధేనువు సహాయంతో వాళ్ళ ఆకలిని తీరుస్తాడు.. ఐతే తరువాత సహస్రబాహువుడు ఆ బ్రాహ్మణుడిని ఆ కామధేనువిని తనకివ్వమని అడుగగా, దానికి నిరాకరిస్తాడు ఆ బ్రాహ్మణుడు.. దాంతో బలవంతంగా దాన్ని అపహరిస్తాడు సహస్రబాహువుడు.. ఐతే ఆ బ్రాహ్మణుడి కుమారుడు(పరశురాముడు) దీన్ని చూసి ఎలాగైనా సహస్రబాహువు మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఘోరమైన తపస్సు చేసి పరశువిని సంపాదిస్తాడు.. దానితో సహస్రబాహువిని హతమారుస్తాడు.. ఐతే ఆ సమయంలో సహస్రబాహువు భార్య తన కుమారులైన “రైస్మణుడు”, “రాముడు” ని పరశురాముడి కంటబడకుండా దాచిపెడుతుంది…

ఇది ఇలా ఉండగా, అప్పుడు లంకా నగరాన్ని దశగ్రీవుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.. అతనికి ఒక కుమార్తె జన్మిస్తుంది.. ఐతే జ్యోతిష్యులు ఆ కుమార్తె వలన అతనికి ప్రాణగండం ఉంది అని చెప్పగా, ఆమెని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేస్తాడు ఆ దశగ్రీవుడు..ఆ బాలిక, ఒక మునికి దొరుకుతుంది.. ఆ ముని ఆమెని చేరదీసి పెంచుతాడు.. ఆమెకోసం ఒక ఆశ్రమం నిర్మించి దాని చుట్టూ ఒక గిరి గీస్తాడు.. ఆమెకి కావలిగా ఒక పెద్ద రాబందుని నియమిస్తాడు.. పక్షులుకూడ ఆ గిరిని దాటి లోపలికి వెళ్ళలేవు.. ఈమె పేరు “సీత”…

అక్కడ రైస్మణుడు, రాముడు పెరిగి పెద్దవారవుతారు.. తమ తండ్రిని చంపిన పరశురాముడి గురించి తెలుసుకుంటారు.. ప్రతీకారాన్ని చల్లార్చుకోవడానికి అతన్ని సంహరిస్తారు, అతన్నే కాకుండా ఇంకా పద్దెనిమిది వేల బ్రాహ్మణులని కూడా వధిస్తారు..

ఒకసారి దేశాటన చేసే సమయంలో, వారికి సీత కనిపిస్తుంది.. ఆమె అందచందాలని చూసి ఇరువురూ మోహిస్తారు.. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించాలని ప్రయత్నించినా సాధ్యపడదు.. చిన్నగా సీతతో పరిచయాన్ని పెంపొందించుకుంటారు.. ఐతే ఈ సమయంలో ఆ ప్రదేశానికి నూరు కన్నుల లేడి వస్తుంది.. దానిని తీసుకురావడానికి రైస్మణుడు, రాముడు వెళతారు.. ఐతే అదే సమయంలో దశగ్రీవుడు అక్కడికి వస్తాడు…. ఆశ్రమంలో కి వెళ్ళాలని విఫలయత్నం చేస్తాడు.. కానీ ఆ రాబందు అడ్డుకుంటుంది.. దాంతో దానికి విషం కలిసిన మాంసపు ముక్కలని (అసలు కధలో తగరపు ముక్కలు అని ఇచ్చారు) ఆహారంగా వేస్తాడు.. అది తెలియని రాబందు వాటిని తిని మరణిస్తుంది.. దాంతో సీతని అపహరిస్తాడు (అతనికి ఈమె తను నదిలో పారవేసిన తన కుమార్తె అని తెలియదు..)


ఇక్కడ నూరు కన్నుల లేడి కోసం అన్వేషిస్తున్న రైస్మణుడు, రాముడు నిరాశతో తిరిగి వస్తూ ఉండగా, వారికి మార్గ మధ్యంలో, ఒక ముసలి కోతి దారికి అడ్డంగా కూర్చుని ఉంటుంది.. దాన్ని తొలగించడానికి తమ శక్తిమేరకి ప్రయత్నిస్తారు.. కానీ ఆ కోతి బలము ముందు వీళ్ళ బలం ఏ మాత్రం సరిపోదు.. దానితో సిగ్గు పడి ఇక ఆశ్రమానికి తిరిగి వస్తారు.. కానీ అక్కడ చనిపొయిన రాబందు కనిపిస్తుంది.. మనస్సు కీడు శంకించగా, లోనికి వెళ్ళి చూడగా సీత ఎక్కడ కనిపించదు.. దాంతో సీతని వెతకడానికి చెరి ఒక దిక్కుకి బయలుదేరి వెళతారు….


అలా సీత జాడకోసం ప్రయత్నిస్తున్న రైస్మణుడు, రాముడు ఒక నువ్వుల చేనులో కలుసుకుంటారు.. సీత కనబడనందుకు విచారిస్తారు.. ఐతే అదే సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు వానరులు (సుగ్రీవుడు, నందుడు) తమ తండ్రి రాజ్యం గురించి పోట్లాడుకుంటూ ఉంటారు.. నందుడు రైస్మణుడి, రాముడి సహాయం కోరతాడు.. ఐతే వారిద్దరి పోలికలూ ఒకేరకంగా ఉన్నందున, రాముడు నందుడి తోక కి అద్దం కట్టుకోమని సలహా ఇస్తాడు.. ఆ యుధ్ధంలో, రాముడి సలహా వలన, రైస్మణుడి సహాయం వలన నందుడు రాజ్యాన్ని పొందగలుగుతాడు..

తనకి చేసిన సహాయానికి ప్రత్యుపకారంగా, నందుడు తన వానరసేన అంతటినీ సీత జాడ కనుగొనమని పంపిస్తాడు.. పంపించేముందు వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తాడు.. ఒకవేళ వారు కనుక వారం రోజులలోపు సీత ఉనికి కనుగొనని యెడల వాళ్ళ కళ్ళు పీకేస్తానని హెచ్చరించి మరీ పంపిస్తాడు..

ఆరు రోజులు గడిచిపోతాయి.. సీత గురించిన ఒక్క ఆధారం కూడా లభించదు.. ఐతే చివరి రోజు ఒక ఆడ కోతి అక్కడ ఉన్న ఆడ కాకి తన పిల్లలతో చెబుతున్న మాటలని వింటుంది.. ఆ కాకి, తన పిల్లలు ఆకలికి తాళలేక ఏడుస్తుంటే వాళ్ళని ఊరడిస్తూ, ఇంకొక్క రోజు ఆగండి, మీ అందరికీ కోతి మాంసం తో విందు చేస్తాను అని అంటుంది.. దానికి ఆ పిల్లలు అది ఎలా వస్తుంది అని అడుగగా, నందుడు సీత జాడని తెలుసుకోమని వానరులని పంపించాడు కానీ దశగ్రీవుడు సీతని ఎత్తుకుపోయాడు, ఈ వానరులకి ఆ సంగతి తెలియదు అని చెబుతుంది.. ఇది విన్న ఆ ఆడ కోతి ఈ వానరుల దగ్గరికి వచ్చి వారిని ఏడిపిస్తూ ఉంటుంది.. ఐతే ఒక మగ కోతి దాన్నుండి, ఈ విషయాన్ని రాబడుతుంది.. వానరులందరూ కలిసి నందుడికి ఈ విషయాన్ని చేరవేస్తారు.. ఇక దశగ్రీవుడి మీద యుధ్ధం చేయాలని నిశ్చయించుకుంటారు రైస్మణుడు, రాముడు.. నందుకి ఒక వరం ఉంది.. అతని చేతితో నీళ్ళలో వేసిన రాళ్ళు తేలతాయని.. ఆ విధంగా వానర సైన్యంతో కూడి రైస్మణుడు, రాముడు లంకని చేరుకుంటారు…

అక్కడ లంకలో దశగ్రీవుడి మంత్రులు అతనికి హిత వాక్యాలని చెబుతారు.. స్తీలని మోహించిన వారు బాగుపడ్డట్లు చరిత్రలో లేదు అని కూడా అంటారు.. అయినా దశగ్రీవుడు వారి మాట పెడచెవిన పెడతాడు.. దాంతో ఆ మంత్రులు శతృశిబిరంలోకి మారిపోతారు…

యుధ్ధం భీకరంగా జరుగుతూ ఉంటుంది..అయితే యుధ్ధంలో వానర సేనదే పై చేయిగా ఉంటుంది.. దానితో ఆ రోజు యుధ్ధంలో దశగ్రీవుడు, సముద్రంలోని ఒక విష సర్పాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తాడు.. దానికి రాముడు మూర్చపోతాడు.. సంజీవని మూలిక తెస్తే బ్రతుకుతాడని వైద్యులు చెబుతారు.. నందుడు దాన్ని తీసుకురావడానికి బయలుదేరతాడు.. ఐతే ఆ మూలిక పేరు గుర్తు రాకపోవడంతో, హిమవత్పర్వతాన్ని పెకిలించుకుని వస్తాడు.. రాముడు కళ్ళు తెరుస్తాడు.. ఈ సారి దశగ్రీవుడు వికటట్టహాసం చేస్తూ సీతతో సహా ఆకాశంలోకి ఎగురుతాడు.. అది చూసి రాముడు మాళ్ళీ మూర్ఛపోతాడు.. అయితే దశగ్రీవుడి ఆయువుపట్టు అతని కాలి బొటనవేలు లో ఉంది అని తెలుసుకున్న రాముడు బాణం సంధిస్తాడు.. దశగ్రీవుడు క్రింద పడిపోతాడు.. లేచి రైస్మణుడిని, రాముడిని శరణు వేడతాడు. దానితో దశగ్రీవుడిని చంపకుండా వదిలేస్తారు… అంతకుముందు రాముడిని మూర్చితిల్లుడిని చేసిన నాగుల మీద తమ ప్రతీకారం తీర్చుకుంటారు రైస్మణుడు, రాముడు..

సీతతో కూడి, జంబూద్వీపాన్ని చేరుకుంటారు.. రైస్మణుడు, రాముడు ఇరువురూ సీతని వివాహం చేసుకుంటారు… ప్రజారంజకంగా నూరేళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారు.. ఐతే తరువత ప్రజలలొ అసంతృప్తి ప్రబలుతుంది.. రైస్మణుడు కానుకలిచ్చి ప్రజలని సంతృప్తి పరచాలని ప్రయత్నిస్తాడు.. సీత ఏమో తను దశగ్రీవుడి ఆధీనంలో ఉండి రావడం వలన ఇలా జరిగిందనుకుని భూమిని చీల్చుకుని ప్రాణత్యాగానికి సిధ్ధపడుతుంది..

ఇవీ ఖోటాన్ రామాయణం లోని విశేశాలు.. ఇంకో విశేషం కూడా ఉంది.. ఈ కధ క్రీ.శ.తొమ్మిదవ శతాబ్దానికి ప్రాచుర్యంలో ఉన్న కధ…

మనకి ఈ కధ చదువుతూ ఉంటే మన భారతంలోనూ, రామాయణంలోనూ ఉన్న పోలికలు కనిపిస్తూ అంతా కొంచెం గందరగోళంగా అనిపించచ్చు…

సహస్రబాహువు, బ్రాహ్మణుడిని కామధేనువు ఇవ్వమని అడగడం, “విశ్వామిత్రుడు వశిష్టుడిని కామధేనువు” అడిగిన సంఘటన ఒకటే…

దశగ్రీవుడు, సీతని ఒక బుట్టలో పెట్టి పారవేయడం, కుంతి కర్ణుడిని వదిలిపెట్టిన సంఘటనకి సారూప్యం.. ఐతే వీరు ఇరువురూ వేరు వేరు ఉద్దేశ్యాలతో ఆ పని చేశారు..

ఇక్కడ నూరు కన్నుల లేడి ఉంటే, మన రామాయణంలో రంగు రంగుల లేడి…

ఇక్కడ సీతని పెంచిన ముని గిరి గీసి దాంట్లో ఆమెని ఉంచితే, అక్కడ లక్ష్మణుడు అలా చేస్తాడు..


రైస్మణుడు, రాముడు అడవిలో తిరుగుతూ ఉండగా, ముసలి కోతి కనబడడం.. ఇది, భారతంలో, భీముడికి హనుమంతుడు కనిపించిన సంఘటనకి దగ్గరగా ఉంటుంది..


ఇక రాముడు మూర్ఛపోతే, నందుడు వెళ్ళి సంజీవని తీసుకురావడం, హనుమంతుడు లక్ష్మణుడికి చేసిన ఉపచారము ఒకటే…

పోలికలు ఎలా ఉన్నాయో, కొన్ని విరుధ్ధాలు కూడా కనిపిస్తాయి..

వాల్మీకి రామాయణం ప్రకారం, రావణుడు చనిపోవాలి.. కానీ ఇక్కడ దశగ్రీవుడిని క్షమించి వదిలేస్తారు..

అక్కడ సీత పాతివ్రత్య పరీక్ష, రావణుడి చెర నుండి విడిపించగానే చేస్తే, ఇక్కడ నూరు సంవత్సరాల తరువాత చేస్తారు..

మనకి ఈ కధలో ఇంకో ఆచారం కూడా కనిపిస్తుంది.. అన్నదమ్ములిద్దరూ ఒకే కన్యని వివాహమాడడం.. ఇప్పుడు ఉన్న ఆచారానికి ఇది విలోమంలో ఉంది.. ఇప్పుడు ఒకే పురుషుడు అక్కచెల్లెళ్ళని వివాహమాడచ్చు.. అంటే ఒకప్పుడు కన్యాశుల్కం, ఇప్పుడు వరకట్నం మాదిరి..

ఇదీ ఖోటాన్ రామాయణం లోని కధ.. వచ్చేవారం బౌధ్ధ ప్రభావం గల వేరే కధలని తెలుసుకుందాం..

10 comments:

Burri said...

ఆవును ఇది కలగూరగంప కధ. కాని బౌధ్ధ ప్రభావం కధలలో ప్రతి కధకు ఒక మంచి నీతి ఉంటును. వాటి కోసం ఎదురుచూపు..

-మరమరాలు

రాధిక said...

మీరు ఎప్పుడు పోస్టులు చేస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను.చాలా ఆశక్తికరం గా వుంటున్నాయి.

Solarflare said...

మీరు బౌద్ద రామాయణం చదివితే వాల్మీకి రామాయణం కంటే ముందే వ్రాసినట్ట్లు ఆధారాలు కనిపిస్తాయి అన్నారు - అవేమిటొ కాస్త చెప్తారా? అలానే ఖోటాన్ అంటే ఇప్పుడు ఏ ప్రదేశమో కుడా తెలియజేస్తె బావుంటుంది

విహారి(KBL) said...

బాగుందండి కధ.ఎన్ని పుస్తకాలు చదువుతున్నారు.తెగ రాసేస్తున్నారు.మీ బ్లాగు ఒక గ్రంధాలయంలా వుంది.

Solarflare said...

సీతకి అయోనిజ అనే పేరు ఎందుకు ఉన్నదో తెలుసా?

విశ్వనాధ్ said...

చాలా బాగా రాస్తున్నారు. ఇలాగే రాస్తూ ఉండండి.
మరికొన్ని విషయాలు తెలుస్తాయి.
@solarflare
భూమి నుండి పుట్టినది కావున సీతను అయోనిజ అంటారనుకుంటా.

ramya said...

వేరే చోట్ల వారి రామాయణం వుందనితెలుసు కాని ఇంత వివరంగా కథలు తెలియదు మీరు రాసింది చాలా ఆసక్తికరంగావుంది.వీటి గురించి ఇంకా రాయండి.

మేధ said...

ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండీ.. నేను సాధారణంగా, వీకెండ్స్ లో, సిస్టమ్ ఆన్ చేయను.. అందుకే నేను సమాధానం ఇవ్వడం ఆలస్యమైంది.. అన్యధా భావించకండి..

@మరమరాలు గారు: అవునండీ బౌధ్ధరామాయణాలలో ఇంకా మంచి కధలు చాలా ఉన్నాయి.. అవన్నీ రాబోయే టపాలలో చూద్దాం..

@రాధిక గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలండీ.. మీరు నా టపాకోసం ఎదురు చూస్తున్నారు అంటే ఇక నుండీ నేను వ్రాసే ప్రతిదీ కొంచెం జాగ్రత్తగా వ్రాయాలనమాట... :)

@సోలార్ ఫ్లేర్ గారు:

మీ మొదటి ప్రశ్నకి సమాధానం:
వాల్మీకి రామాయణంలో ని సంఘటనలకి, దాంట్లో ఉన్న ఆచారావ్యవహారాలు ఇప్పటి కాలానికి కొంచెం దగ్గరగా ఉంటాయి.. అదే బౌధ్ధరామాయణంలోని కధలని చూస్తే వాటిల్లో చాలా పురాతనమైన ఆచారాలు కనిపిస్తూ ఉంటాయి మనకి.. అంటే వాటిని వాల్మీకి రామాయణం కంటే ముందే వ్రాసినట్లు కదా...

ఇక ఖోటాన్ దేశం అంటారా, ఇప్పుడది చైనాలో, టిబెట్ సమీపంలో ఉంది..

ఇక మీ రెండో ప్రశ్నకి సమాధానం:
సీతని అయోనిజ అని ఎందుకు అంటారంటే, ఆమె మాములుగా జన్మించలేదు(అంటే ఏ స్త్రీకి జన్మించలేదు) కాబట్టి అలా అంటారు..

@విహారి గారు: ఏదో మీ అభిమానం కానీ నాకు అంత సీన్ లేదండీ.. మరొక్కసారి మీ అభిమానానికి కృతజ్ఞతలు..

@విశ్వనాధ్ గారు: అంత ఓపికగా నా టపాలని చదువుతున్నందుకు ధన్యవాదాలు.. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను..

@రమ్య గారు: మీకు కూడా చాలా థ్యాంక్సండీ.. మిగతా టపాలలో, వేరే కధలని వ్రాస్తాను..

Solarflare said...

చాలా థాంక్స్ అండి ఓపికగా సమాధానాలు చెప్పినందుకు. కాని నాకింకొక సందేహం :)
వాల్మికి రామాయణాన్ని మీరు సంస్కృతంలొనే చదివారా లేక దాని తెనుగించిన version (versionకి తెలుగేమిటొ?) - ఎందుకంటే - తెనుగించినదైతే - ఆ తెనుగించిన వారు మార్పులు చేసి ఉండవచ్చు కదా. అదండి నా సందేహం.

మేధ said...

@సోలార్ ఫ్లేర్ గారు: నేను సంస్కృతంలో చదవలేదండీ.. అయినా ఎంత తెనిగించినా, మూల కధలో ఎవరూ మార్పులు చేయరు కదండీ, కేవలం వర్ణనలో తేడాలు ఉంటాయి.. తెలుగు రామాయణంలో అయినా, సంస్కృతంలో అయినా, రాముడు వనవాసానికి వెళ్ళాడు, సీతని రావణుడు ఎత్తుకుపోయాడు, రాముడు రావణుడిని సంహరించి, విజయంతో తిరిగి వస్తాడు. అంతే కదా...!