Friday, September 28, 2007

రామునికి సీత ఏమవుతుంది…?

              మనం ఇప్పుడు లావోస్ రామాయణంలోని కధలని తెలుసుకుందాం…

               లావోస్ దేశంలో, రకరకాల రామాయణ గాధలు ప్రాచుర్యంలో ఉన్నాయి.. అయితే వాటిల్లో ప్రసిధ్ధమైనవి “దశవిలాసాల రాజు నిదానం ”.. “రామ జాతకం" కధలు..

దశవిలాసాల రాజు నిదానం:

               దశవిలాసాల రాజు, జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు.. అతనికి నలుగురు భార్యలు…. ఒక్కొక్క భార్య వలన, ఒక్కో కుమారుడు కలిగాడు.. వాళ్ళు “రాముడు”, “లోమనుడు”, “భరతుడు”, “శతృసంహారకుడు”..  వాల్మీకి రామాయణంలో లానే, దీంట్లో కూడా రాజుకి మూడవ భార్య అంటే తగని ప్రీతి.. ఒకసారి ఆనంద సమయంలో ఉన్నప్పుడు ఆమెకి ఒక వరాన్ని ఇస్తాడు.. దానికి ఆమె, తరువాత కోరుకుంటాను అని అంటుంది..

               పిల్లలందరూ, రాజగురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు.. అందరిలోకీ రాముడు చాలా తెలివిగలవాడు.. అతనికి చాలా శక్తులు ఉండేవి.. శతృవు అదృశ్య రూపంలో ఉన్నా, శబ్దాన్ని గ్రహించి వారితో యుధ్ధం చేసేవాడు..

                 వయోభారం వలన, మహారాజు ఆరోగ్యం క్షీణిస్తుంది.. దాంతో ఆయన, రాముడిని యువరాజు గా పట్టాభిషిక్తుడిని చేస్తాడు.. అయితే అది మూడవ భార్యకి నచ్చదు.. రాజుని తనకి ఇచ్చిన వరం నిలుపుకోమని చెబుతుంది.. తన కొడుకైన భరతుడికి పట్టం కట్టి, రాముడిని వనవాసం చేయమని చెబుతుంది.. తండ్రి మాట కోసం రాముడు అరణ్యాలకి వెళ్ళడానికి సిధ్ధపడతాడు.. అయితే లోమనుడు అందుకు ఒప్పుకోడు… రాణికి వ్యతిరేకంగా తిరగబడమని చెబుతాడు అన్నగారికి.. అందుకు రాముడు ససేమీరా అంటాడు.. పితృవాక్య పరిపాలన ఆవశ్యకతని తెలియజేస్తాడు.. వనవాసానికి బయలుదేరతాడు..

                రాజ్యంలో ఇన్ని మార్పులు జరుగుతున్న సమయంలో, భరతుడు అక్కడ ఉండడు.. తిరిగి రాజ్యానికి చేరుకోగానే, జరిగిన సంగతులన్నీ తెలుసుకుంటాడు.. అదే సమయంలో, మంచం పట్టి ఉన్న తండ్రి కాలం చేస్తాడు.. దీంతో హతాశుడైన భరతుడు, ఎలా ఐనా అన్నగారిని తిరిగి తీసుకురావాలని అరణ్యానికి వెళతాడు.. అయితే రాముడు దీనికి ఒప్పుకోడు.. ఇక అన్నగారి ఆజ్ఞ మేరకు, ఆయన పాదుకలు(తోలు చెప్పులు) తీసుకుని రాజ్యానికి వెళ్ళి రాముడి ప్రతినిధుడిగా పరిపాలిస్తూ ఉంటాడు.. వనవాసంలో ఉన్నా, ఎల్లప్పుడూ రాముడికి లేఖలు, సందేశాలు పంపిస్తూ ఉండేవాడు.. రాముడు కూడా వాటికి ప్రత్యుత్తరాలు ఇస్తూ ఉండేవాడు.. చివరికి ఒక శుభముహుర్తాన, రాముడి వనవాసం పూర్తి అవుతుంది.. రాజ్యానికి తిరిగి వచ్చి అధికారాన్ని చేపడతాడు.. ఆయన పరిపాలనలో, సకాలంలో వర్షాలు పడేవి.. ప్రజలకి సంవత్సరానికి మూడు పంటలు పండేవి.. ఇలా ప్రజారంజకంగా పరిపాలించాడు..

             ఇదీ క్లుప్తంగా దశవిలాసాల రాజు నిదానం కధ…

             దీంట్లో మనకి సీత కానీ, రావణుడు కానీ, ఎక్కడా కనిపించరు.. అసలు వాళ్ళ ఊసే లేదు.. కేవలం రాముడి వనవాసం, తిరిగి రావడం మాత్రమే కనిపిస్తుంది..

             సరే ఇప్పుడు “రామ జాతకం” చూద్దాం..

రామ జాతకం:

             ఇంద్రప్రస్థ రాజ్యంలో, దశరధుడు, విరులహుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు… ఇద్దరిలో, దశరధుడు బలహీనుడు.. దాంతో, విరులహుడు రాజ్యం మొత్తాన్ని ఆక్రమించుకుని దశరధుడిని గెంటివేస్తాడు.. అతను అడవులకి వెళ్ళిపోతాడు.. అక్కడే ఒక రాజ్యాన్ని నిర్మించుకుని జీవిస్తూ ఉంటాడు..ఆ నగరం పేరు చంద్రపురి..

             దశరధుడికి ఒక కుమార్తె… ఆమె పేరు “నంగ్ చంద్ర”… అయితే ఆమెని రావణుడు ఎత్తుకుపోతాడు..

               ఇక్కడ రావణుడి గురించి తెలుసుకుందాం.. ఇతను మరెవరో కాదు దశరధుడి తమ్ముడైన విరులహుడి కుమారుడు.. అయితే తండ్రీ కొడుకులిద్దరికీ పొసగక, ఆయన తన కుమారుడిని రాజ్య బహిష్కారం చేస్తాడు.. రావణుడు లంకలో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు… ఒకసారి ఇంద్రుడి ఆహ్వానం మీద అమరలోకానికి వెళతాడు.. అక్కడ ఉన్న దేవకన్య ని చూసి మనసు చలిస్తుంది.. దానితో ఆమెని బలాత్కరిస్తాడు.. తరువాత తిరిగి తన రాజ్యానికి వస్తాడు..

              అక్కడ దేవలోకంలో, ఆ అప్సరస, తనకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా, రావణుడిని సంహరించడానికి ఘోరమైన తపస్సు చేస్తుంది.. వర ప్రభావం వలన, రావణుడికి కుమార్తె గా జన్మిస్తుంది.. అయితే జ్యోతిష్యుల వలన, ఆమె వల్ల తన ప్రాణానికే ముప్పు అని తెలుసుకున్న రావణుడు, ఆమెని నదిలో విసిరివేస్తాడు.. అలా నదిలో కొట్టుకుపోతున్న ఆమెని, ఒక ముని రక్షించి.. ఆమెకి సీత అని నామకరణం చేసి పెంచుతూ ఉంటాడు…

              ఇప్పుడు ఈ రావణుడే దశరధుడి కుమార్తె ని అపహరిస్తాడు.. అయితే రావణుడి ఎదిరించడానికి ఆయన శక్తి సరిపోకపోవడంతో, అతన్ని మట్టుబెట్టగల కుమారుని కోసం తపస్సు చేస్తాడు.. భగవంతుని అనుగ్రహం వలన అతనికి “ప్రలమ్” అనే పుత్రుడు జన్మిస్తాడు..

             ప్రలమ్ పెరిగి పెద్దవాడవుతాడు.. అదే సమయంలో సీత అందచందాలు దేశమంతటా వ్యాపిస్తాయి.. ఆమెకి స్వయంవరం ప్రకటిస్తారు.. ప్రలమ్ తో పాటు రావణుడు కూడా దానికి హాజరవుతారు..(రావణుడికి ఆమె తన కుమార్తె అని తెలియదు) అయితే ప్రలమ్ స్వయంవరంలో ధనస్సుని వంచి సీతని చేబడతాడు.. భార్యతో రాజ్యానికి తిరిగి వెళతాడు.. అయితే అదే ఆ సమయంలో, చెల్లిని ఎత్తుకుపోయిన సంగతి తెలుసుకుంటాడు.. దానితో, రావణుడి మీద దండెత్తి తన చెల్లిని విడిపించుకుని తీసుకు వస్తాడు..

            తరువాత, ఒకసారి ప్రలమ్, సీత ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా, అక్కడికి మాయ లేడి వస్తుంది.. దాన్ని వెంబడిస్తూ ప్రలమ్ చాలా దూరం వెళతాడు. అయితే చివరకు అది కనిపించకపోవడంతో, నిరాశగా తిరిగి వస్తాడు.. అయితే ఇక్కడ సీత కనిపించదు…దానితో, సీతని అన్వేషిస్తూ బయలుదేరతాడు… అయితే శాపకారణం వలన, అతనికి కోతి రూపం వస్తుంది..ఆ రూపంలో ఉన్నప్పుడు అతనికి హనుమంతుడు అనే కుమారుడు జన్మిస్తాడు.. శాప విమోచనం కలిగిన తరువాత మళ్ళీ అతను మానవరూపం పొందుతాడు.. అప్పుడు, తన తమ్ముడితోనూ, హనుమంతుడితోనూ కలిసి రావణుడి మీదకి దండెత్తి అతన్ని సంహరించి, సీతతో తిరిగి రాజ్యానికి వస్తాడు…

          ఇదీ అక్కడ ప్రసిధ్ధమైన రామ కధ..

          మనం ఈ కధని పరిశీలిస్తే, ఖోటాన్ రామాయణంలో చెప్పుకున్న కధకి దీనికి దగ్గర సంబంధం కనిపిస్తుంది..

           అక్కడ దశగ్రీవుడు తనకి కలిగిన కుమార్తె ని నీటిలో పారవేస్తాడు, ఇక్కడా అంతే…

           దాంట్లో నందుడి సహాయంతో లంకకి చేరితే, దీంట్లో హనుమంతుడి సహాయంతో వెళతారు..

           రెండిటిలో నూరుకన్నుల లేడి (మాయాలేడి), సీతాపహరణం జరిగినాయి…

ఇక రెంటి మధ్య బేధాలని చూద్దాం..

         అక్కడ దశగ్రీవుడిని క్షమించి వదిలి పెడతారు, కానీ ఇక్కడ సంహరిస్తారు…

         ఇప్పటివరకు చెప్పుకున్న కధల్లో, రాముడు, రావణుడు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడతారు.. ఇక్కడ మాత్రం రెండు సార్లు యుధ్ధం జరుగుతుంది..

            ఇలా ఎందుకు జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం… మొదటి తరం కధల్లో, ఏకోదరుల మధ్య వివాహం ఉంది.. తరువాత తరం వచ్చేసరికి ఆ ఆచారం లేదు, అయితే అన్నదమ్ములిద్దరూ, ఒకరినే వివాహం చేసుకునే ఆచారం కనబడుతుంది.. ఆ తరువాత తరంలో, అసలు ఇలాంటి ఆచారం కనబడదు.. (ప్రలమ్ ఒక్కడే సీతని వివాహం చేసుకుంటాడు, అతని తమ్ముడు వివాహం చేసుకోడు) అయితే మూల కధ మరీ మార్చకుండా ఉండడానికి, చెల్లెలిని అలాగే ఉంచారు, ఆమెని రావణుడు ఎత్తుకుపోవడాన్ని చూపించారు, అయితే వారి మధ్య వివాహం మాత్రం ప్రస్తావించలేదు…. అంటే కాలానికనుగుణంగా, ఆచార వ్యవహారాలు మారుతూ ఉన్నాయనమాట..

            ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.. కేవలం ఒక చిన్న వర్ణనతో, సమాజంలో అభివృధ్ధి ఎలా ఉందో చెబుతుంది.. దశరధ జాతకంలో, రాముడు తృణపాదుకలు ధరించాడు.. అంటే గడ్డి చెప్పులు అన్నమాట.. అదే ఈ కధలో ఆయన తోలుచెప్పులు ధరించాడు అంటే చర్మం తో తయారుచేసినవి.. దీన్ని బట్టి ప్రజల స్థాయిలు మారాయి అని గమనించవచ్చు…

           ఈ రామ కధలో భగవంతుడి అనుగ్రహం వలన రాముడు జన్మిస్తాడు.. అదే తరువాత తరువాత, వాల్మీకి రామాయణంలో, పుత్రకామేష్ఠిగా రూపాంతరం చెంది ఉండచ్చు..

          అలానే మనకి ఈ కధలో, దశరధుడికి, ముగ్గురు నలుగురు భార్యలున్నట్లు కానీ, ఆయన ఒక భార్యకి ఇచ్చిన వరం మూలంగా, రాముడిని వనవాసానికి పంపించడం కూడా కనిపించదు.. అందుకే అక్కడ “దశ విలాసాల రాజు నిదానం” కధ కూడా ప్రచారంలో ఉంది..

          అంతే కాకుండా, ఈ కధలో సీత పాతివ్రత్య పరీక్ష కూడా లేదు..

          రాముడి (ప్రలమ్) చెల్లెలి గురించి ప్రస్తావన వచ్చింది కదా.. ఆ ప్రస్తావన కేవలం అక్కడ రామాయణాల్లోనే కాదు, మన ఆంధ్ర దేశంలో వ్రాసిన స్త్రీల రామాయణంలో, బెంగాల్లో వాడుకలో ఉన్న చంద్రావతి కావ్యంలోనూ కనిపిస్తుంది..దాంట్లో ఆమె పేరు శాంత.. వీటి పూర్తి వివరాలు తరువాత తెలుసుకుందాం..

         అవీ లావోస్ రామాయణంలోని విషయాలు, విశేషాలు.. వచ్చేవారం మరిన్ని కధలని తెలుసుకుందాం..

3 comments:

Admin said...

నీ కోసం బ్లాగ్ కు సవరణలు ఇచ్చినందుకు thanks.

విహారి(KBL) said...

కధలు మీ వివరణ బాగుంది.

మేధ said...

నెనర్లు విహారి గారు...