Friday, September 14, 2007

రామునికి సీత ఏమవుతుంది…?

ఏంటీ నిన్నే కదా ఏదో కధ వ్రాస్తానని చెప్పి మళ్ళీ ఈ కధ వ్రాస్తున్నాను అనుకుంటున్నారా.. మరి మన ప్రభువులు కూడా వాళ్ళ మాట వెనక్కి తీసుకున్నారు కదండీ.. నేనూ అంతే.. "యధా రాజా తధా ప్రజా" అని ఊరికే అన్నారా..? సరే మనం మళ్ళీ కధలో కి వచ్చేద్దాం.. పోయిన వారం “పేరుతెలియని రాజు కధ”ని గురించి తెలుసుకున్నాం కదా..ఈ వారం “దశరధ జాతకం” గురించి తెలుసుకుందాం..

దశరధ జాతకం:

పూర్వకాలంలో దశరధుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు..ఆయనకి పదహారువేల మంది భార్యలు…(ఇదేంటి కృష్ణుడికి కదా అనుకుంటారేమో ఇది బౌధ్ధ రామాయణం కదా.. దీంట్లో, బుధ్ధుడు రెండు అవతారాలని ఒకేసారి ధరించాడు అనుకుంటా..!) సరే ఆయన పట్టపురాణికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.. పెద్ద కుమారుడి పేరు “రామ పండితుడు”, రెండో కుమారుడి పేరు “లక్ష్మణ పండితుడు”(ఇక్కడ వరకు బానే ఉంటుంది.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్), కుమార్తె పేరు “సీత”..(మన సౌలభ్యం కోసం వాళ్ళని రాముడు, లక్ష్మణుడు, సీత గా వ్యవహరించుకుందాం)

అనారోగ్య కారణాల వలన పట్టపురాణి కాలం చేసింది.. తరువాత తనకున్న మిగిలిన భార్యలలో ఒక రాణిని దశరధుడు పట్టమహిషిగా చేసుకున్నాడు.. ఈ రాణి అంటే దశరధుడికి వల్లమాలిన అభిమానం..ఆమె వలన ఒక కుమారుడు జన్మిస్తాడు.. అతని పేరు భరతుడు..ఆ ఆనంద సమయంలో, రాణినికి ఒక వరం కోరుకోమంటాడు.. దానికి ఆవిడ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు నా కోరిక తీర్చండి అని అంటుంది..

సరే ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటాయి.. రాముడు, లక్ష్మణుడు, సీత అందరూ యుక్తవయసుకి వస్తారు..భరతుడికి ఏడేళ్ళు వచ్చిన తరువాత పట్టపురాణి దశరధుడి దగ్గరకు వెళ్ళి, తన బిడ్డని రాజుని చేయమని వరం కోరుకుంటుంది.. కానీ దశరధుడు మొదట్లో దీనికి ఒప్పుకోడు. ఇక రాణి, సామ దాన బేధ దండోపాయాలలో భాగంగా, అలిగి ఆగ్రహగృహాన్ని చేరుతుంది.. విషయం తెలుసుకున్న దశరధుడు మొదట మధనపడతాడు, తరువాత తన పరిస్థితికి తానే జాలిపడతాడు, చివరిగా రామ లక్ష్మణు లని ఏమన్నా చేస్తుందేమో అని భయపడతాడు.. దాంతో, హుటాహుటిన జ్యోతిష్యులని పిలిపిస్తాడు, తన ఆయుర్దాయం ఎంత ఉందో లెక్కలు వేయమంటాడు.. వాళ్ళు గ్రహాల స్థితిగతులని బట్టి మీరు పన్నెండేళ్ళు జీవిస్తారు అని చెబుతారు.. సరే అని వెంటనే రామ, లక్ష్మణులని పిలిపిస్తాడు. మీరు ఇక్కడే ఉంటే, మీ సవతి తల్లి మిమ్మల్ని చంపేయవచ్చు కాబట్టి, ఈ పన్నెండేళ్ళు వనవాసం చేసి నేను చనిపోయిన తరువాత వచ్చి రాజ్యాన్ని పరిపాలించండి అని చెబుతాడు.. దానికి వాళ్ళిద్దరూ సరే అని బయలుదేరుతుండగా, ఇంతలో సీత అక్కడకి వచ్చి, నేను కూడా అన్నలతో కూడి వనవాసానికి వెళతాను అని వెళ్ళిపోతుంది.. ముగ్గురూ హిమాలయాలకి (హిమాలయాలలో ఉన్న అరణ్యాలకి) వెళ్ళి అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉంటారు..

ఇక్కడ దశరధుడేమో, పుత్రశోకంతో తొమ్మిదేళ్ళకే మరణిస్తాడు.. ఆ వెంటనే భరతుడు రాజ్యం చేపడదామని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, మంత్రులు దానికి ఒప్పుకోరు.. అసలు రాజు వనవాసంలో ఉన్నాడు, ఆయన తప్ప వేరెవరూ రాజ్యాన్ని చేపట్టకూడదని ఆంక్షలు పెడతారు.. దీంతో చేసేదేమి లేక, భరతుడు రాముడిని తీసుకురావడానికి అరణ్యానికి వెళ్తాడు.. సరిగ్గా భరతుడు వెళ్ళిన సమయానికి, ఆశ్రమంలో రాముడు ఒక్కడే ఉంటాడు, సీత లక్ష్మణులు పని మీద బయటకి వెళ్ళారు.. తండ్రి మరణ వార్త విన్న తరువాత కూడ ఏమీ చలించలేదు రాముడు (మన రామయణం లో, రాముడు బాగా బాధపడ్డాడని చదివినట్లు గుర్తు, కానీ ఇలాంటి వర్ణనలు తెలుగు వాళ్ళకి బాగ నచ్చుతాయి ఎందుకంటే, ఎన్ని కష్టాలు వచ్చిన హీరో నిశ్చలంగా, స్థిరచిత్తుడై ఉండాలి కానీ ఏడవకూడదు..!) సరే ఇంతలో, సీత లక్ష్మణులు ఆశ్రమానికి చేరుకుంటారు.. రాగానే రాముడు వాళ్ళిద్దరినీ ఏటిలో స్నానం చేసి రమ్మంటాడు.. నీటిలో దిగగానే తండ్రి మరణవార్త వాళ్ళకి తెలియజేస్తాడు.. అది తెలియగానే, సీతాలక్ష్మణులు మూర్ఛపోతారు.. రాముడు వాళ్ళని ఊరడిస్తాడు.. తండ్రికి చేయవల్సిన శ్రాధ్ధకర్మలని ముగ్గురూ ఆచరిస్తారు..

అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత, భరతుడు రాముడిని రాజ్యానికి రమ్మని కోరతాడు.. దానికి రాముడు నిరాకరిస్తాడు.. నన్ను తండ్రిగారు పన్నెండేళ్ళు వనవాసం చేయమన్నారు, ఇప్పటికి తొమ్మిదేళ్ళే పూర్తైంది, మిగిలిన మూడేళ్ళు పూర్తైన తరువాతనే రాజ్యానికి తిరిగివస్తాను అని చెబుతాడు.. ఐతే సీతని, లక్ష్మణుడిని నీతో తీసుకువెళ్ళు, నీకు పరిపాలనలో సహాయపడతారు అని అంటాడు.. దానికి భరతుడు మరి రాజ్యాన్ని ఎవరి పేరున పరిపాలించాలి అని అడుగగా, దానికి రాముడు, నా పాదుకలని తీసుకువెళ్ళు, నేను వచ్చేంతవరకు అవే రాజ్యాన్ని పరిపాలిస్తాయి అని చెబుతాడు.. దాంతో భరతుడు, సీతని, లక్ష్మణుడిని, రాముడి పాదుకలని తీసుకుని రాజ్యానికి వెళ్ళిపోతాడు..

పాదుకల సహాయంతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు.. అవి మామూలు పాదుకలు కావు, శక్తివంతమైనవి.. సింహాసనం మీద పాదుకలని అధిష్టించేవాళ్ళు.. వాటి ముందే తీర్పులు చెప్పేవారు.. తీర్పు సరిగ్గా లేకపోతే అవి వాటిలో అవి పోట్లాడుకొనేవి.. సరియైనది ఐతే మాములుగా ఉండేవి.. ఈ విధంగా మూడేళ్ళు గడిచిన తరువాత, రాముడు రాజ్యానికి తిరిగి వస్తాడు..

రాముడిని శాస్త్రోక్తంగా పట్టాభిషిక్తుడిని చేస్తారు.. సీతతో వివాహం చేస్తారు. రాముడు మహారాజుగా, సీత పట్టపురాణిగా పదహారువేల సంవత్సరాలు పరిపాలన సాగిస్తారు..

ఇదీ దశరధ జాతక కధ.. మొదట్లో అంతా బావున్న ఈ కధ, చివరిలో మింగుడు పడకపోవచ్చు.. నీతి, నియమాలకి కట్టుబడే రాముడు సొంత చెల్లిని ఎలా వివాహం చేసుకుంటాడు అని అనిపించచ్చు.. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.. ఈ కధ ఇప్పుడు జరిగింది కాదు.. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగింది.. అప్పటి నియమాలు వేరు, కట్టుబాట్లు వేరు.. ఆ కాలంలో ఏకోదరులైన వారి మధ్య వివాహమే న్యాయసమ్మతం.. దానికి కట్టుబడే రాముడు, సీతని వివాహం చేసుకుంటాడు.. మనం దీనికి చారిత్రక ఆధారలకోసం పరిశీలించినా కూడా దొరుకుతాయి..!! ఈజిప్ట్ నాగరికతలో, ఇలాంటి ఆచారాలు ఉండేవి.. ఆ దేశపు నాగరికత ఈ ఆచారమంత ప్రాచీనం.. అయినా అక్కడిదాక వెళ్ళక్కర్లేదు మన వేదాలలో కూడ ఈ ఏకోదరుల మధ్య వివాహ ప్రస్తావన ఉంది.. దానికి ఉదాహరణ “యమ యమి జంట”.. అసలు యమ అన్న పదానికి, ఒక అర్ధం జంట అని కూడా….

దీన్ని బట్టి మనకి రెండు విషయాలు తెలుస్తున్నాయి.. ఎప్పుడో ఈజిప్ట్ లో పాటించిన ఆచారాలు రామాయణంలో ఉన్నాయి అంటే, పూర్వకాలంలో రాముడి రాజ్యం అంత విస్తృతమైంది అని ( ఒక సంవత్సరం క్రితం అనుకుంటా ఈజిప్ట్ లోనో, దానికి దగ్గర ప్రాంతాలలో, శిధిలమైన విష్ణుమూర్తి విగ్రహాలు దొరికాయని వార్త వచ్చింది), అప్పటి ఆచారాలు ఎన్నో మార్పులు చేర్పులు పొందాయని..

వచ్చేవారం బౌధ్ధ ప్రభావంగల, ఖోటాన్ రామాయణంలోని కధలని తెలుసుకుందాం..

9 comments:

విహారి(KBL) said...

అంతా బాగుంది ముగింపు తప్ప.

మేధ said...

@విహారి గారు: అందుకే చివరిలో చెప్పాను.. ఈ కధ ఇప్పుడు జరిగినది కాదు.. ఎప్పటిదో అని..

అప్పటి ఆచారాలు వేరు, ఇప్పుడు ఆచారాలు మారాయి కాబట్టి అలా అనిపిస్తుంది అదే ఇప్పుడు కూడా అదే ఆచారాలు కొనసాగితే (ఆ ఊహే భయంకరంగా అనిపిస్తోంది కదా!).. నేను కేవలం అప్పటి ఆచారాలు ఎలా ఉండేవో అని మాత్రమే చెబుతున్నాను.. అంతే..

Burri said...

ఈ టపా చదివే ముందు నేను ఆంధ్రభూమి లోని ఈ రోజు కాలమ్ చదివినాను ( పాలంసత్యం గారు రాసిన: పెక్కు భంగులు..), మీకు మన చరిత్ర రాసినవారికి కొద్ది పొలికలు కనపడినాయి (May be ఈజిప్టు విషయంలో). నా ఉద్దేశం లో మీరు బాగా వ్రాయలేదు అని కాదు. మీలాగా ఆ రోజు వారు కూడా సీత అన్న రాముడు అని రాసి ఉంటే .. హతావిధి..

ఇది నా హృదయభాను పలికిన పలుకులు, సీరియస్ గా తీసుకోకండి.

-మరమరాలు

రాధిక said...

నాకు సరిగా తెలియదు గానీ నా చిన్నతనం లో మా ఇంటికి వచ్చిన ఒక పెద్దాయన వాల్మీకి రామాయణం లోనే రాముడికో రావణుడికో సీత చెల్లెలి వరస అవుతుందని అన్నట్టు గుర్తు.

విహారి(KBL) said...

మీకు వినాయకచవితి శుభాకాంక్షలు

మేధ said...

@మరమరాలు గారు: మీరు ఇచ్చిన లింక్ వేరే దానికి వెళుతోందండీ, అయినను సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు..

నేనేమీ నా సొంతంగా ఊహించి వ్రాయలేదండీ ఈ కధని.. అలా అప్పటి కధలలో ఉంది నేను దాన్ని వ్రాశాను అంతే..
అప్పటి ఆచారాలు మనకి ఇప్పుడు తప్పుగా, వింతగా అనిపించచ్చు.. ఐనంతమాత్రాన అవి అలా ఉండకూడదు అని అనలేము కదా..

ఉదాహరణకి 100యేళ్ళ క్రితం కన్యాశుల్కం ఉండేది.. ఇప్పుడు వరకట్నం ఉంది.. అయినంతమాత్రానా మనం కన్యాశుల్కం లేదు అని చెప్పలేము కదా.. ఎందుకంటే దానికి ఆధారాలు మనకి కనిపిస్తునాఅయి.. అలానే పరిణామక్రమంలో కోతి మనిషిగా రూపొందింది కదా.. అలా అని కోతిని చూసి ఇదేంటీ ఇంత ఛండాలంగా ఉంది.. నేను దీని నుండి వచ్చాను అంటే ఒప్పుకోను అని అనలేము కదా.. అలానే అన్న చెళ్ళెళ్ళు వివాహమడడం అనే ఆచారం కూడా అంతే...

ఇంకా ఇలాంటి కధలు చాలా ఉన్నాయి.. అప్పటినుండి ఆచారాలు మార్పులు చెంది ఇప్పుడు మనకి తెలిసినవి ఏర్పడ్డాయి.. ఆ కధలన్నీ చదివితే అప్పుడు అర్ధమవుతుంది..

ఇక నేను మీ మాటలని సీరెయస్ గా ఏమీ తీసుకోలేదు.. మీ అభిప్రాయం మీరు చెప్పారు.. దీనికి నేను సీరియస్ అవడం ఎందుకు..!!

@రాధిక గారు: వాల్మీకి రామాయణం లో ఉందో లేదో తెలియదు కానీ, జైన రామాయణం లో మాత్రం చదివానండి

Burri said...

ధ్యాంక్స్, మీకు ఆ వ్యాసం ఇంకా చదవలెను అనుకొంటే ఇక్కడ ఉంది. బాగం-1, బాగం-2, బాగం-3, బాగం-4. నేను ఒక రోజు ఒక బ్లాగులో కామేంట్ రాసినాను. ఆది అతనికి నచ్చక నామీద ఒక టపా రాసినాడు, అందుకని ముందు జాగ్రత్తగా "సీరియస్ గా తీసుకోకండి" అని రాసినాను.
-మరమరాలు

మేధ said...

@మరమరాలు గారు: ఇప్పుడు మీరు పంపించిన లింక్ చదివానండీ..

ఆ కాలం వ్రాసిన వారు ఇప్పుడు రాముడు లేడంటున్నరు అనే విషయం మీద వ్రాశారు.. దానికి నా టపాకి పోలిక లేదు (మీరు కూడ అదే అన్నారనుకోండి ఒక్క ఈజిప్ట్ విషయంలో తప్ప..!)

ఐతే నాది ఒక చిన్న విన్నపం.. నేను ఈ కధలని రాముడి మీద, సీత మీద లేక రామాయణం మీద వ్యతిరేకం గా మాత్రం వ్రాయడం లేదు.. మనం తెలుసుకోవలసిన చరిత్ర చాలా ఉంది అనే ఉద్దేశ్యంతోనే వ్రాస్తున్నాను..
నేను మొదట ఆరుద్ర గారు వ్రాసిన “రాముడికి సీత ఏమవుతుంది” పుస్తకం చద్వడం మొదలుపెట్టినప్పుడు నాకు అసలు నచ్చలేదు.. కానీ పుస్తకం చివరిలో ఆయన వ్రాసిన వ్యాఖ్యని చదివిన తరువాత నాకున్న దురభిప్రాయం మొత్తం పోయింది.. ఆయన ఏమన్నారంటే “రాముడు సీత ఆదర్శ పురుషులు”, అందుకే ప్రతి చరిత్రలోను, ప్రతి రామాయణం లోనూ, ఆ కాలానికి తగిన ఆచారాలతో వారిని చూపించారు అని… కాదంటారా..?!

Burri said...

మేధ మీకు ధన్యవాదలు, నాకు చాలా వరకు క్లీయర్ అయినది. సత్యం గారు రాసినట్లు "పెక్కు భంగు"లో మీది కూడా ఒక కధ(భంగు) అని నా అభిప్రాయం. అవును వాల్మీకి రామాయణం చాలా చాలా గొప్పది.
-మరమరాలు